ప్ర‌ధాని మోడీ, బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ ల మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ‌

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ లో నెలకొన్న పరిస్థితులపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ఫోన్‌ చర్చలు జరిగాయి. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు కూలంకషంగా చర్చించినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేసి, దౌత్య మార్గానికి తిరిగి రావాలని ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు భారతదేశం నిరంతర కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. సమకాలీన ప్రపంచ వ్యవస్థకు ప్రాతిపదికగా అంతర్జాతీయ చట్టం అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై భారతదేశానికి ఉన్న నమ్మకాన్ని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం, ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక ప్రయోజనాలపై కూడా చర్చించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, రక్షణ మరియు భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకునే సామర్థ్యాన్ని అంగీకరించారు. తదనుగుణంగా, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగడం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ఇద్దరు నేతల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఆమోదించిన ‘ఇండియా యుకె రోడ్‌మ్యాప్ 2030’ అమలులో సాధించిన పురోగతిని కూడా ఆయన అభినందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/