నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi reveals names of astronauts picked for Gaganyaan mission at ISRO centre

న్యూఢిల్లీః గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్​తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. వీళ్లతో మోడీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులుగా అభివర్ణించారు మోడీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్​లో గగన్​యాన్ ప్రాజెక్టు పురోగతిని మోడీ పరిశీలించారు.

21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. చంద్రయాన్, గగన్​యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోడీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని అన్నారు. గగన్​యాన్ మిషన్​లో చాలా వరకు భారత్​లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని చెప్పారు.

“దేశాభివృద్ధి ప్రయాణంలో కొన్ని ఘట్టాలు భవిష్యత్​ను నిర్దేశించేవిగా ఉంటాయి. ఇది అలాంటి క్షణమే. గగన్​యాన్ మిషన్​కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఇప్పుడు దేశానికి పరిచయం అయ్యారు. వీరు నలుగురు వ్యక్తులు మాత్రమే కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు స్పేస్​లో అడుగుపెట్టనున్నారు. కానీ ఈసారి వ్యోమగాములను పంపించే రాకెట్ మనం సొంతంగా తయారు చేసుకున్నది. టైమ్, కౌంట్​డౌన్ అన్నీ మనవే.”