చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలి: ప్రధాని మోడీ

PM Modi remarks at beginning of the Budget Session of Parliament

న్యూఢిల్లీః శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందని తెలిపారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని పేర్కొన్నారు. చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరని పరోక్షంగా ప్రతిపక్షాలను హెచ్చరించారు. బుధవారం పార్లమెంట్​ సమావేశాలకు హాజరయ్యే మందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు.

కాగా, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 9వ తేదీతో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోడీ సమాధానంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.

ఏప్రిల్‌-మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌ వార్షిక పద్దును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే ప్రభుత్వం జులైలో మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

YouTube video