ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మృతదేహానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

ఆయనతో తనకు సుదీర్ఘ పరిచయం ఉందన్న ప్రధాని

pm-narendra-modi-pays-last-respects-to-parkash-singh-badal-in-chandigarh

చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోడీ శిరోమణి అకాలీదళ్ పార్టీ అగ్రనేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కు నివాళులు అర్పించారు. ప్రధాని మోడీ బుధవారం చండీగఢ్ లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి ప్రకాశ్ సింగ్ (95) బాదల్ కన్నుమూయడం తెలిసిందే.

‘‘ప్రకాశ్ సింగ్ బాదల్ మరణించడం నాకు వ్యక్తిగతంగా నష్టం. ఎన్నో దశాబ్దాలుగా ఆయనతో నాకు సన్నిహిత పరిచయం ఉంది. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను’’అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దేశానికి బాదల్ ఎన్నో సేవలు అందించారంటూ, పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేశారంటూ ప్రధాని కీర్తించారు. బాదల్ ను గతంలో కలుసుకున్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు.

బాదల్ మృతితో కేంద్ర సర్కారు రెండు రోజుల పాటు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించింది. 1957లో సర్పంచ్ గా ఎన్నికైన బాదల్ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రానికి ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఎన్డీయే భాగస్వామిగానూ శిరోమణి అకాలీదళ్ పార్టీ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. నూతన రైతు చట్టాలకు నిరసనగా రైతుల ఆందోళన నేపథ్యంలో 2020లోనే బీజేపీతో సంబంధాలు తెంచుకుంది.