భారత్‌లో పెట్టుబడులు పెట్టండి..అమెరికా పారిశ్రామికవేత్తలకు మోడీ భేటి

మైక్రాన్ టెక్నాలజీ, జనరల్ ఎలక్ట్రిక్, అప్లైడ్ మెటీరియల్స్ సీఈఓలతో మోడీ భేటీ

pm-modi-invites-micron-technology-to-boost-semiconductor-manufacturing-in-india

వాషింగ్టన్‌: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు. చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారెన్స్ కల్ప్, అప్లైడ్ మెటీరియల్స్ సీఈఓ గారీ ఈ డికర్సన్‌తో ప్రధాని సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం మైక్రాన్ సీఈఓ సంజయ్ మీడియాతో మాట్లాడారు. మోడీతో సమావేశం అద్భుతంగా జరిగిందన్నారు. భారత్‌ కోసం ఆయన దార్శనికత అద్భుతమని కొనియాడారు. భారత్‌లో అపార అవకాశాలను చూస్తున్నామని చెప్పారు.

భారత్‌లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు జీఈ సంస్థ అందించాల్సిన సహకారంపై కంపెనీ సీఈఓ లారెన్స్ కల్ప్‌తో ప్రధాని చర్చించారని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక భారత్ అద్భుతమైన అభివృద్ధి వైపు పయనించే సమయం ఆసన్నమైందని అప్లైడ్ మెటీరియల్స్ సీఈఓ గారీ ఈ డికర్సన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాసెస్డ్ టెక్నాలజీ, అత్యాధునిక ప్యాకేజింగ్ సామర్థ్యాలను పెంచేందుకు అప్లైడ్ మెటీరియల్స్ సంస్థ భారత్‌కు రావాలని ప్రధాని ఆహ్వానించారు.