ముచ్చింత‌ల్ లో ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక పూజ‌లు

కాసేపట్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ

హైదరాబాద్: విశ్వ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. హైదరాబాదులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన విష్వ‌క్సేనేష్టి యాగంలో ప్ర‌ధాని మోడీ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, చిన్న‌జీయ‌ర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు పాల్గొన్నారు. యాగంలో పాల్గొన్న మోదీకి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సంద‌ర్భంగా మోడీకి చిన్న‌జీయ‌ర్ స్వామి ఓ కంక‌ణాన్ని బ‌హుక‌రించారు. అనంత‌రం యాగ‌శాల చుట్టూ మోడీ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. మోదీ బంగారు వ‌ర్ణం దుస్తులు ధ‌రించి యాగానికి హాజ‌ర‌య్యారు. కాసేపట్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల వారి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి పూజలు నిర్వహించనున్నారు.

ముచ్చింతల్ లో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం జరుపుకుంది. 2014లో సమతామూర్తి కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు రూ.12 వేల కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకుంది. ఇందులో భాగంగా పంచలోహాలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు. విగ్రహం దిగువన మూడంతస్తుల నిర్మాణం ఉంటుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/