నరేంద్రమోడీ తీసుకొచ్చిన అతిపెద్ద పథకం పేరు “ప్రైమ్ మినిస్టర్ జూట్ బోలో యోజన” : జైరామ్ రమేశ్

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
రాజస్థాన్‌లో గత ఐదేండ్లుగా తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము ప్రజలను కోరుతున్నామని, బిజెపి నేతలు మాత్రం విద్వేష ప్రసంగాలు, అసత్యపు ప్రచారంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఈ ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోడీ అని విమర్శించారు. గడిచిన పదేళ్లలో నరేంద్రమోడీ తీసుకొచ్చిన అతిపెద్ద పథకం పేరు ‘ప్రైమ్ మినిస్టర్ జూట్ బోలో యోజన’ అని ఆయన మండిపడ్డారు.
తాము రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, మళ్లీ గెలిపిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 భృతి చెల్లిస్తామని చెబుతున్నామని జైరామ్ రమేశ్ తెలిపారు. ప్రధాని మోడీ, ఇతర బిజెపి నేతలు మాత్రం రాజస్థాన్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అసత్యపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు జరగడం లేదా..? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరగుతుంటాయని, కానీ కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నట్టు మాట్లాడం కరెక్టు కాదని జైరామ్ రమేశ్ చెప్పారు. బిజెపి నేతల అబద్ధపు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెడ్డపేరు రావడం లేదని, రాజస్థాన్ రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు వస్తున్నదని మండిపడ్డారు.