చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ

YouTube video

చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం విశేషం. ఇది దేశంలోని ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ బెంగళూరు మీదుగా చెన్నై, మైసూరు మధ్య సేవలు అందిస్తుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన భారతదేశపు మొదటి సెమీ హైస్పీడ్ రైలు. ఇది వేగవంతమైన యాక్సెలరేషన్‌, డీసెలరేషన్‌ అధిక వేగాన్ని అందుకోగలదు. ప్రయాణ సమయాలను 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గిస్తుంది. ఈ రైలు 52 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. అన్ని వందే భారత్ కోచ్‌లకు ఆటోమేటిక్ డోర్‌లు ఉంటాయి. GPS బేస్డ్‌ ఆడియో-విజువల్ ప్యాసెంజర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ కోసం ఆన్-బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi, సౌకర్యవంతమైన సీటింగ్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రొటేటింగ్‌ ఛైర్లు ఉంటాయి.

బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి కర్నాటక నుంచి కాశీకి యాత్రికులను పంపించేందుకు భారత్ గౌరవ్ పథకం కింద ఈ రైలును తీసుకువచ్చింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లను సందర్శించడానికి యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించారు.