టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం..

టీఆర్ఎస్‌ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఆయన భార్య సరోజ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసాగ‌ర్ రావు స‌తీమ‌ణి స‌రోజ శ‌నివారం తెల్ల‌వారుజామున ఇంట్లో పిండి వంట‌కాలు చేస్తుండ‌గా గ్యాస్ లీకై ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి.

ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. ప్రస్తుతం సరోజను చికిత్స కోసం హైద‌రాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక విద్యాసాగర్ రాజకీయ సంగతుల విషయానికి వస్తే..1997లో తెలుగుదేశం పార్టీ చేరిన ఈయన.. 1998లో మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2001లో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరపున గెలుపొంది , జెడ్పీలో టిడిపి పక్ష నాయకుడిగా ఉన్నారు. 2002 నుంచి మూడేళ్ళ పాటు కరీంనగర్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా పని చేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు కారణంగా మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ మెట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలనే సంకల్పంతో 2008లో కెసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

2009లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావుపై గెలుపొందారు. 2010 ఫిబ్రవరిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010 జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్ రావుపై రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.