తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ సచివాలయంలోని బీఆర్కే భవనంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా .. వైరస్ లక్షణాలున్న ఉద్యోగులు పరీక్షలు చేసుకోగా అందులో మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం ఐదుగురు కరోనా బారినపడగా..మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. బిల్డింగ్ లోని గదులన్నీ ఇరుకుగా ఉండటంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని ఉద్యోగులు అంటున్నారు.

గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,295 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 64,474 పరీక్షలు చేయగా 2 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కరోజే 1452 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 218, మేడ్చల్ జిల్లాలో 232 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో 24 గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,89,751కి చేరింది. మరణాల సంఖ్య 4039కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 పాజిటివ్ కేసులు ఉన్నాయి.