గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో.. మొక్క‌లు నాటిన‌ ప్ర‌కాశ్ అంబేద్క‌ర్

రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాశ్‌ అంబేద్కర్‌..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క‌లు నాటారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో మొక్కను నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త , రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్, బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ ‘తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బీఆర్‌.అంబేద్కర్’ స్పూర్తిని కొనసాగిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు ‘ మనుషుల్లో సమానత్వం, ప్రకృతి సమతూల్యత’ కోసం పరితపించిన అంబేద్కర్జయంతి రోజున మొక్కను నాటడం సంతోషంగా ఉందన్నారు. ‘ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని కోరుకున్నారు. మొక్కలు నాటడం పట్ల వారికి అమితమైన ఆసక్తి ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చూస్తున్నానని’ ఆయన పేర్కొన్నారు.

మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ కృషి అనితరసాధ్యమైనది.‘ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ’ లిమ్కాబుక్ లో చేరడం ఆనందం కలిగించింది. వారి కృషికి మరింత గుర్తింపు రావాలి. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని’ ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.