ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే కరోనా టీకా: ఫైజర్

అమెరికా: ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారులకు కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్​డీఏకు దరఖాస్తు చేసుకుంది ఫైజర్‌. తమ కొవిడ్‌ టీకాకు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని సవరించి 6నెలల పసికందు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులను కూడా చేర్చాలని ఎఫ్​డీఏను కోరినట్లు ఫైజర్‌ తెలిపింది. ఎఫ్​డీఏ అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలిటీకాగా ఫైజర్‌ నిలవనుంది.

కరోనా కారణంగా అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్‌ తెలిపింది. భవిష్యత్‌ వేరియంట్లను ఎదుర్కొనటంతో పాటు వైరస్‌ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్​డీఏతో కలిసి పని చేస్తున్నట్లు ఫైజర్‌ పేర్కొంది.ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే టీకా.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఫైజర్​ తెలిపింది. ఇది దేశంలో పాఠశాలలకు వెళ్లని సుమారు కోటి 90 లక్షల చిన్నారుల కోసం రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/