ఆగని పెట్రో మంట..ఈరోజు కూడా భారీగా పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధర

పెట్రో మంట మళ్లీ మొదలైంది. వరుసగా నాల్గు రోజులుగా పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతూ వస్తూ వాహనదారులకు కన్నీరు పెట్టిస్తుంది. శుక్రవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 31 పైసలు,డీజిల్‌ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు. ఇంట్లో నుండి వాహనం తీయాలంటే భయం వేస్తుందని అంటున్నారు. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.73కి చేరింది. డీజిల్ కూడా సెంచరీ కొట్టి మరింతగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 100.51గా ఉంది.

ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ , డీజిల్ ధరలు మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 115.45కి చేరింది. లీటర్ డీజిల్ రేటు రూ.106.02 పలుకుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇంధన ధరలను జీఎస్టీలో చేర్చేందుకు పలు రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం తెలిపింది. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్ రేటు రూ.75-80కి దిగొస్తుంది. అదే జరిగితే.. సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుంది. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.