పెట్రో వీరబాదుడు : రూ. 120 దాటిన పెట్రోల్ ధర

చమురు సంస్థలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ బంక్ ల వైపు చూడాలంటే భయం వేసేలా చేస్తున్నాయి. రోజు రోజుకు పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో 13వ సారి పెట్రోల్ రేట్లు పెంచి సామాన్య ప్రజల జీవితాలను రోడ్డున పడేసేలా చేస్తున్నాయి. ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధ‌రలు మ‌రోసారి పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్ పై 91 పైస‌లు, లీట‌ర్ డీజిల్ పై 87 పైస‌ల చొప్పున పెంచాయి చమురు సంస్థలు.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా.. రూ. 120 మార్క్ ను అందుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ. 118. 59 కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో వాహానాల వినియోగం కూడా త‌గ్గుతుంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.120 దాటింది. తాజాగా పెంచిన 88 పైసలతో.. పెట్రోల్ ధర రూ.120.39కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.106.04కు చేరుకుంది. వైజాగ్​లో 87 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.1కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.104.79కు ఎగబాకింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ లో పెట్రోల్ ధర రూ.104.61కు చేరగా.. డీజిల్ ధర రూ.95.87కు పెరిగింది. ముంబయిలో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.119.67కు ఎగబాకింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.103.92కు చేరుకుంది. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110.08కు చేరుకోగా.. డీజిల్ ధర 76 పైసలు పెరిగి రూ.100.16కు ఎగబాకింది. కోల్​కతాలో లీటర్ పెట్రోల్​పై 83 పైసలు, డీజిల్​పై 80పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.114.26గా ఉంది. డీజిల్ ధర రూ.99.01కి చేరింది.