పార్లమెంట్ ఎన్నికలు ఎఫెక్ట్..పెట్రోల్ ధరలు తగ్గింపు

కేంద్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పెట్రోల్ , గ్యాస్ ధరలు తగ్గించి సామాన్యులకు కాస్త ఊరట కల్పిస్తుంటారు. ఎన్నికల తర్వాత మళ్లీ పెంచుతారు అనుకోండి..ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో పెట్రోల్ ధరలు తగ్గించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.

కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి రాబోతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది.