ఫోన్ల హ్యాకింగ్‌..విపక్ష నేతల ఆరోపణలపై స్పందించిన మంత్రి పియూష్‌ గోయల్‌

విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చు..

Minister Piyush Goyal On Hacking Row

న్యూఢిల్లీః ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం పై తమ ఐఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్‌ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్‌ అలర్ట్‌’ సందేశాలు రావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై విపక్షాలు కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఖండించారు. వారిని ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చంటూ వ్యాఖ్యానించారు. ‘విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.

కాగా, మంగళవారం ఉదయం విపక్ష ఎంపీలు తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఆరోపించడం తీవ్ర కలకలం రేగింది. తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చ‌తుర్వేది, శ‌శి థ‌రూర్‌, ప‌వ‌న్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘ‌వ చ‌ద్దా, ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ .. త‌మ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ కంపెనీల నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వంతో లింకున్నసైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నట్లు త‌మ‌కు మెసేజ్‌లు వ‌స్తున్నట్లు ఆ ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్ల నుంచి మీ ఐఫోన్‌కు హ్యాకింగ్‌ ముప్పు ఉన్నది. మీ యాపిల్‌ ఐడీ ద్వారానే మీ ఫోన్‌ను టార్గెట్‌ చేసే అవకాశం ఉన్నదని యాపిల్‌ భావిస్తున్నది. మీ ఫోన్లు హ్యాక్‌ అయితే సున్నితమైన డాటా, కమ్యూనికేషన్లను తస్కరించే ప్రమాదం ఉన్నది. కెమెరా, మైక్రోఫోన్లను యాక్సెస్‌ తీసుకొంటుంది. ఇది హెచ్చరిక నకిలీ కూడా కావొచ్చు. అయినప్పనటికీ దీన్ని సీరియస్‌గా తీసుకోండి’ అని ఆ సందేశం సారాంశం. దీనిపై రాజకీయ దుమారం రేగింది.

పలువురు ఎంపీలు, నేతలు తమ ఫోన్లకు వచ్చిన ఈ నోటిఫికేషన్‌ స్క్రీన్‌షాట్లను మంగళవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. విపక్ష పార్టీల ఎంపీల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నదని దుమ్మెత్తిపోశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్‌ హ్యాకింగ్‌ అలర్ట్‌ సందేశాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.