దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కళారంగం చేనేత

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కళారంగం చేనేత అని పవన్ కొనియాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతీయ కళల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మాట్లాడవలసింది చేనేత కళా రంగం గురించే. నా పక్షాన, జనసేన పక్షాన చేనేత కళాకారులందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. చేనేత అభివృద్ధికి జనసేన కూడా ఇతోధిక కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ‘జనసేన చేనేత వికాస విభాగం’ ఏర్పాటు చేశాం. చేనేత కళాకారుల సమస్యల పరిష్కారం, వారి అభ్యున్నతికి ఈ వికాస విభాగం పాటుపడుతుంది.

ఈ ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించేందుకు నన్ను నేను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించుకున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ కృషి ఇక మీదట కూడా ఇదే విధంగా కొనసాగుతుందని తెలియ చేస్తున్నాను. చేనేత దినోత్సవం సందర్భంగా యావత్ జాతికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చేనేతను ధరిద్దాం – చేనేత కళాకారులను ప్రోత్సహిద్దాం – భారతీయ చేనేత కళారంగాన్ని కాపాడుకుందాం’’ అని పవన్ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/