వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పరామర్శించిన పవన్

మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన వైనం

pawan-kalyan-visits-women-family-in-pendurthi-constituency

విశాఖ: గత నెల చివరి వారంలో విశాఖలో కోటగిరి వరలక్ష్మి (72) అనే వృద్ధురాలు వాలంటీర్ వెంకట్ చేతిలో దారుణ హత్యకు గురైంది. బంగారు నగలు చోరీ చేయడం కోసం ఆ వాలంటీర్ వృద్ధురాలిని అంతమొందించాడు. కాగా, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెందుర్తి నియోజకవర్గంలోని సుజాత నగర్ లో ఉన్న వరలక్ష్మి నివాసానికి పవన్ వెళ్లారు. అక్కడ వరలక్ష్మి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. విషాదంలో ఉన్న వరలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. పవన్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. వృద్ధురాలు హత్యకు గురికావడం పట్ల చలించిపోయిన పవన్ భోరున విలపించారు. వారితో మాట్లాడుతున్నంత సేపు చెమర్చిన కళ్లతో కనిపించారు.

ఈ సందర్భంగా, వృద్ధురాలు వరలక్ష్మి కుమారుడు మాట్లాడుతూ, తమ తల్లిగారిని పవన్ కల్యాణ్ తన తల్లిగా భావించారని వెల్లడించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై పోరాడతానని మాటిచ్చారని వెల్లడించారు.