28 నుంచి మూడ్రోజుల పాటు కాకినాడలో పవన్ పర్యటన

pawan-kalyan-respond-on- pawan-kalyan-three-day-tour-in-kakinada-will-be-commenced-on-dec-28

అమరావతిః జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 28 నుంచి మూడ్రోజుల పాటు కాకినాడ నియోజకవర్గం పరిధిలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తన పర్యటన సందర్భంగా పవన్ పార్టీ సమీక్షల్లో పాల్గొంటారు. ఏపీలో ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై పవన్ ఈ పర్యటన ద్వారా ఓ స్పష్టత తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దీనిపై జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని ఓ పోస్టు పెట్టింది. కాకినాడలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా… ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, సామాజిక సాధికారతే లక్ష్యంగా అభ్యర్థుల జాబితాపై జనసేనాని కసరత్తు చేయనున్నారని శతఘ్ని వెల్లడించింది.

పవన్ కల్యాణ్ ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపింది. ఎన్నికల్లో పోటీకి 70 స్థానాలపై గురిపెట్టారని వివరించింది. టిడిపితో కలిసి సామాజిక సాధికారతే లక్ష్యంగా జాబితా రూపొందించనున్నారని శతఘ్ని పేర్కొంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో జనసేన బలంగా ఉందని స్పష్టం చేసింది. ప్రత్యర్థి పార్టీలోని సీనియర్ నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నారని వెల్లడించింది.