చీమలపాడు బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్

ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలను సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బాధితులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా అన్యాయం జరిగితే తనకు కాల్ చేయాలని పవన్ వారికి సూచించారు.

ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన పేరుతో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బుధువారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమ‌ల‌పాడు వ‌ద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ క్రమంలో నేత‌ల‌ను ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ కార్యక‌ర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పుర‌వ్వలు ఎగిరిప‌డి స‌భా ప్రాంగ‌ణానికి 200 మీట‌ర్ల దూరంలో ఉన్న గుడిసెపై ప‌డ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకుని అది పేలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలంలో రమేశ్, మంగు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.