పవన్ పిఠాపురం షెడ్యూల్ ఖరారు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనాల మధ్యలోనే వెళ్లేందుకు రెడీ అయ్యాడు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుండి తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి , సింగిల్ స్థానానికే పరిమితమైన జనసేన..ఈసారి పొత్తుతో బరిలోకి దిగబోతుంది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు , 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇక పిఠాపురం నుండి పవన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ తరుణంలో మూడు విడతలుగా పవన్‌ ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు. ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈనెల 30న పిఠాపురం వెళ్తారు. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్‌ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. మూడూ అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు, మచిలీపట్నం పార్లమెంట్ పై కొనసాగుతున్న సందిగ్ధత కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల నేతలతో ఇప్పటికే భేటీ అయిన పవన్ కల్యాణ్.. పలుమార్లు చర్చలు నిర్వహించారు.