వైసీపీకి మరో షాక్ తగలబోతుందా..?

ఏపీ అధికార పార్టీ వైసీపీ కి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. టికెట్ రాని నేతలంతా రాజీనామాలు చేస్తూ ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీని వీడగా..తాజాగా మరో కీలక నేత పార్టీ మారబోతున్నట్లు తెలుస్తుంది. వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దర్శి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. ఈ నెల 27న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సానుకూలంగా ఉండడం తో ఆయన టిడిపి వైపు అడుగులేస్తున్నట్లు వినికిడి.

అనేక వ్యాపారాలతో ఎంతో పేరు సంపాదించుకున్న శిద్దా రాఘవరావు 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశాడు. 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. 2014.. సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత టీడీపీ ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం టీడీపీ అధికారం కోల్పోయాక వైసీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో తిరిగి టీడీపీ గూటికి చేరుకునేందుకు సిద్దమవుతున్నారు.