పిఠాపురంలో పవన్ ఆత్మీయ సమావేశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఆదివారం పిఠాపురంలో జనసేన , టీడీపీ, బిజెపి కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పొత్తు కుదుర్చుకున్నామని వెల్లడించారు. జనసేన-టీడీపీ-బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలకు తావులేని రీతిలో పొత్తు కుదిరిందని అన్నారు.

జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేదానిపై తాను లెక్కలు వేసుకోలేదని, ఏపీ భవిష్యత్ బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ఏపీ ప్రజలను బయటపడేయాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి షరతులు లేకుండా పొత్తు కుదుర్చుకున్నామని తెలిపారు. పొత్తు కారణంగా మా పార్టీ నేతలు కూడా బాగా నలిగిపోయారు. చాలామంది ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం కోసం మనసుతో స్పందించాను. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందని, ఆయనను పరామర్శించేందుకు వెళుతుంటే, దారి పొడవునా టీడీపీ శ్రేణులు తమ నాయకుడి కోసం పడిన తపన తనను కదిలించి వేసిందని అన్నారు. అందుకే, రాజమండ్రి కారాగారంలో చంద్రబాబును కలిసిన తర్వాత, తనవంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించానని పవన్ వెల్లడించారు. పిఠాపురంలో టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కలుపుకుని వెళతానని జనసేనాని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం, వర్మ గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా వ్యవహరిస్తామని తెలిపారు.