కొత్త ‘మా’ సభ్యులకు షాక్ ఇచ్చిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి నాగబాబు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అతడు జాతీయస్థాయి నటుడు అంటూ.. కింది నుంచి పైకి వచ్చాడు అంటూ ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.’ ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు ’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు.

‘మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీకాంత్ అలాగే విజేతలందరికి నా అభినందనలు. నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్ట్ లందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం.. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే..ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’ అని మెగాస్టార్ చిరజీవి ట్వీట్ చేశారు.