పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రాబోయే ఎన్నికల్లో పొత్తుల ఫై కీలక ప్రకటన చేసారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వారాహి విజయయాత్ర కమిటీలతో శనివారం పవన్‌ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మనం కష్టపడి పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. పొత్తులు ఉంటాయో ఉండవో తేలే వరకుపార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడ వద్దని కోరారు.

ఏలూరులో ఆదివారంనుంచి ప్రారంభం కానున్న మలిదశ వారాహి విజయయాత్రకు అందరూ సహకారం అందించాలని పవన్ కోరారు. వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్లారా చూశానని అన్నారు. ఈ పోరాటం వృథా కాదని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక ఈరోజు ఆదివారం సా. 5 గంటలకు ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రేపు జనవాణి కార్యక్రమంతో పాటు ఏలూరు ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం కానున్నారు. ఈనెల 11న దెందులూరు నియోజకవర్గంలో నాయకులతో సమావేశమై సాయంత్రం తాడేపల్లి గూడెం చేరుకుంటారు. ఈనెల 12న తాడేపల్లిలో బహిరంగసభ నిర్వహిస్తారు.