హెచ్ 1 బీ వీసాదారులకు శుభవార్త

హెచ్ 4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయొచ్చన్న డిస్ట్రిక్ జడ్జి

H-1B visa-holders’ spouses can work in US, says judge

న్యూఢిల్లీః అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్త.. ఈ వీసాదారుల భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేయొచ్చని అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలాదిమంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. భారతీయులతో పాటు అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులు అందరికీ ఈ తీర్పు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు ఇచ్చే వీసానే హెచ్ 1 బీ.. ఈ వీసాతో అమెరికాలో అడుగుపెట్టే ఉద్యోగస్తులు తమ భాగస్వాముల (భార్య లేదా భర్త) ను కూడా తీసుకెళ్లొచ్చు. వారికి అమెరికా ప్రభుత్వం హెచ్ 4 వీసా (డిపెండెంట్) ఇస్తుంది. ఈ హెచ్ 4 వీసాతో అమెరికాలో ఉంటున్నవారు నిబంధనల ప్రకారం ఉద్యోగం చేయడానికి అవకాశంలేదు. అయితే, బరాక్ ఒబామా హయాంలో ఈ రూల్స్ కు సవరణలు చేశారు. దీంతో వేలాదిమంది హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేసే వీలు కలిగింది.

ఒబామా సర్కారు నిర్ణయాన్ని ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ సంస్థ కోర్టులో సవాల్ చేసింది. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగం చేసే అవకాశం కల్పించడం వల్ల అమెరికా పౌరులు నష్టపోతున్నారని, వారి ఉద్యోగాలను ఈ హెచ్ 4 వీసాదారులు లాక్కుంటున్నారని వాదించింది. దీనిపై అమేజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర అంతర్జాతీయ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కోర్టులో ప్రతివాదులుగా తమ వాదనలు వినిపిస్తూ.. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల అమెరికాకు వచ్చే నిపుణుల సంఖ్య పెరుగుతుందని చెప్పాయి. డిపెండెంట్ వీసాదారుల నైపుణ్యం దేశానికి ఉపయోగపడుతుందని తెలిపాయి. ఇరువైపులా వాదనలు విన్న డిస్ట్రిక్ జడ్జి తన్యా చుట్కాన్.. హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయొచ్చని, ఒబామా సర్కారు తెచ్చిన రూల్ ను కొనసాగించాల్సిందేనని తీర్పు చెప్పారు.