ఏపీ రోడ్ల ఫై మరోసారి పవన్ ఆగ్రహం ..రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయని ఎద్దేవా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ రోడ్ల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవల్సి వస్తోందని, రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయని ఎద్దేవా చేసారు. రోడ్ల అభివృద్ధి చేతకాకపోతే కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను సైతం వైస్సార్సీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని దుయ్యబట్టారు. వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్​తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి.. ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి సవాల్‌ చేశారని.. ఆ ఛాలెంజ్​ను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్​కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ ​బీ పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6,100 కి.మీ ఉన్నాయని.. ముఖ్యంగా 9,222 కి.మీ పంచాయతీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రకటించడాన్ని గుర్తు చేసారు. దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉందని… రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. మూగ జీవాలు కదా.. వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఏమోగానీ వైస్సార్సీపీ నేతలు రోడ్లు వేయడం మానేశారని ఎద్దేవా చేశారు.