‘జనసేన’ను అధికారంలోకి తీసుకొస్తాం

పార్టీ ఆవిర్భావ సభలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

•చిత్తశుద్ధితో యుద్ధానికి సన్నద్దమవుతున్నాం

రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అయితే పొత్తుల గురించి ఆలోచిస్తాం

రాష్ట్ర బాధ్యతను స్వీకరిస్తున్నాం

•ఏపీని అప్పుల్లేని రాష్ట్రంగా మార్చడమే ‘జనసేన’ లక్ష్యం

Pawan Kalyan at the Janasena Party inaugural meeting
Pawan Kalyan speaking at the Janasena Party inaugural Day celebrations in Ippatam village near Mangalagiri on monday night

Magalagiri: అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని, వైసీపీని గద్దెదించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చిత్తశుద్ధితో యుద్ధం చేసేందుకు సన్నద్ధ మవుతున్నామని అన్నారు. అందుకోసం బీజేపీ అగ్రనాయకత్వం రోడ్ మ్యాప్ ఇస్తానందనీ, అది ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పని చేస్తామని తెలిపారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామనీ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ లక్ష్యం.. ఉద్దేశ్యమని అన్నారు. వైపీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదనీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అయితే పొత్తుల గురించి ఎన్నికల సమయంలో ఆలోచిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తాడన్నారు. ఆత్మగౌరవానికీ, ఆధిపత్య అహంకారానికి మధ్య జరుతున్న పోరులో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. అమరావతి, మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావసభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసగించారు.

ఇప్పటం గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు

ఈ సభను జరుపుకునేందుకు అనుమతిచ్చి మా పొలాల్లో సభను చేసుకోమని చెప్పిన ఇప్పటం గ్రామ రైతు సోదరులకు ముందుగా కృతజ్ఞతలు. మీరు చూపించిన ఈ ప్రేమ, సభ పెట్టుకోండని అండగా నిలబడ్డందుకు మీకు మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామ అభివృద్ధికి వ్యక్తిగతంగా నా ట్రస్టు నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను. మా జనసేన నాయకుల ద్వారా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, పంచాయతీకి రైతు పెద్దల ద్వారా గ్రామ పంచాయితీకి అందచేస్తాను.”అని అన్నారు

ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నాం. ఆ వైసీపీ వాళ్లు పట్టుకెళ్లిన సీటు మనదే. 137 స్థానాల్లో పోటీ చేసి సరాసరి 7.24 శాతం ఓటు సాధించాం. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అది 27.4 శాతానికి పెరిగింది. పంచాయితీ ఎన్నికల్లో 60 శాతం మంది జనసేన మద్దతుతో బరిలో దిగారు. మనం సాధించింది 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు మెంబర్ల గెలుపు. రాష్ట్రవ్యాప్తంగా 2000 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్ధుల్ని బరిలో నిలిపింది. అందులో 180 గెలిచాం. 156 జెడ్పీటీసీ స్థానాల్లో నిలబెట్టి రెండు కైవసం చేసుకున్నాం. విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు మిగతా మున్సిపాలిటీలకు పోటీ చేసి కార్పోరేటర్లుగా, వార్డు మెబర్లు గెలుచుకున్నాం. అందులో 28 శాతం ఓటు సాధించగలిగాం. పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరకుంది. పక్క పార్టీలకు ఇది గొప్ప విజయంగా కనబడకపోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక రూపం. ముఖ్యమంత్రి తండ్రి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. తెలుగుదేశం పార్టీ కూడా మూడున్నర దశాబ్దాలుగా ఉంది. జనసేనలో సీనియర్ నాయకులు ఎవరూ లేరు. అందుకే ఈ విజయాన్ని మనం బలంగా గుర్తు పెట్టుకోవాలి. ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుంది. ఒక మహా వృక్షమైనా చిన్న విత్తుతో మొదలవుతుంది. ముల్లోకాలను ఏలే వీరుడైనా అమ్మ కడుపు నుంచే మొలవ్వాలి. ఈ రోజున 7 శాతం నుంచి 27 శాతానికి.. రేపటి రోజున ఆ 27 శాతం ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి చేరబోతున్నామని .పవన్ తన ప్రసంగం లో పేర్కొన్నారు

చీకటి పాలన అంతమొందించే అవకాశం వచ్చింది

క్రియాశీలక కార్యకర్తలుగా 150 మందితో మొదలై త్వరలో 5 లక్షలకు చేరుకోబోతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, చీకట్లలోకి వెళ్ల కూడదు అంటే అది ఈ 5 లక్షల మంది జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో ఉంది. మీ పోరాట పటిమ మీద, మీ గుండె నిబ్బరం మీద ఆధారపడి ఉంది. నేను నడిచి చూపిస్తా  మీరు నడవండి. ఒక కొత్త తరం జాతికి నిర్ధేశం చేసే

సమయం వచ్చింది. 1970ల్లో ఎమర్జెన్సీ సమయంలో దేశంలో రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పుడు దేశానికి దిశానిర్ధేశం చేసే అవకాశం యువతకు వచ్చింది. అలాగే 2022లో ఈ చీకటి పాలనను అంతమొందించడానికి అవకాశం వచ్చింది. ఇలాంటి సామాజిక నిర్మాణం చేసే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం” అని అన్నారు

వైసీపీ అశుభంతో పరిపాలన మొదలు పెట్టింది

ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలు పెడతారు. కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తాం. కానీ మీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో అశుభంతో పరిపాలన మొదలు పెట్టింది. మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చింది. ఇసుక పాలసీ రాకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. 30 లక్షల పైచిలుకు భవన నిర్మాణ రంగ కార్మికులు, అనుబంధ రంగాల వారి జీవితాలను మీరు ఒక్క ఇసుక పాలసీతో చిందరవందర చేశారు. 32 మంది నిండు ప్రాణాలను మీ నాయకత్వం బలిగొంది. దానికి మీ వైసీపీ కార్యకర్తలు ఏం సమాధానం చెబుతారు. ఇసుక పాలసీకి అసలు సమస్య ఏంటి అంటే ఇసుక కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి. ఏ పాలసీ తెస్తే మా వైసీపీ నాయకులకు వేల కోట్లు వస్తాయనే ఆ పార్టీ నాయకుల ఆలోచనకు మూల్యమే 32 నిండు ప్రాణాలు. ఆడపడుచుల్ని మీరు విధవల్ని చేశారు గుర్తు పెట్టుకోండి. ఆ రోజు నుంచి వరుస క్రమంలో ఇప్పటి వరకు.. నిన్నటి మన సభకు ఆటంకం కలిగించేంత వరకు చూస్తే ఇంత విధ్వంసపూరితమైన ఆలోచనా విధానం ఏంటిరా బాబు అనిపిస్తుంది.” అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి మారినప్పుడల్లా పాలసీలు మారవు

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అందరూ ఒప్పుకున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడేమో మూడు రాజధానులు అంటున్నారు. అలాగే గత ప్రభుత్వం చేసుకున్న పీపీఎస్ ఒప్పందాలను కూడా రద్దు చేశారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మాకు సంబంధం లేదంటే ఎలా?  గవర్నమెంట్ అంటే కంట్యూనిటీ

 ఆఫ్ పాలసీ. రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చడం, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా పాలసీలు మార్చడం సరికాదు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో తప్పొప్పులు ఉంటే సరిచేయాలి తప్ప. మేము చేయం అంటే కుదరదు. ఒప్పందాలపై సంతకాలు పెట్టుకున్న తరువాత దానిని మనం పాటించకపోతే చట్టసభల్లో కూర్చురే అర్హత లేదని సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలను మనందరం ఈ సందర్భంగా గుర్తించు కోవాలి” అని పేర్కొన్నారు

న్యాయ వ్యవస్థను శాసించే హక్కు మీకు లేదు

అమరావతి నేపథ్యంలో న్యాయ వ్యవస్థనే తప్పు పట్టే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్లింది. మీరు చేసిన చట్టాలనే మీరే పాటించనప్పుడు న్యాయ వ్యవస్థను శాసించే హక్కు మీకే లేదు. వైసీపీ నాయకులు కొందరు ఎంత ఒళ్లు పొగరుగా మాట్లాడుతున్నారంటే… హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్ ఆఫీసుగా మారిందని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా, అమెరికాలో కూర్చొని బూతులు తిట్టించడం. ఏ స్థాయిని వెళ్లిపోయారంటే న్యాయమూర్తుల జీవితాల్లో వెళ్లి తిడుతున్నారు. క్రిమినల్స్ రాజకీయాలు ఏలితే ఇలానే ఉంటుంది. ఈ తప్పును మనందరం కలిపి చేశాం” అని అన్నారు.

ఏపీని అప్పుల్లోకి నెట్లేశారు 

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. దాదాపు రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి. అప్పు తీర్చడం కాదు కదా వడ్డీలు కూడా కట్టలేని స్థితికి వెళ్లిపోయారు. లక్ష కోట్ల ఆదాయం ఉండి కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. యువతకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగులకు జీతాలు పెరగడం లేదు. పెన్షన్లు తగ్గించారు. కరెంటు బిల్లులు పెంచారు. అమ్మఒడి డబ్బులు ఆగిపోయాయి. ఆరోగ్య శ్రీ పథకాన్ని మంచమెక్కించేశారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి పంపించేసి పెట్టుబడులను చంపేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే అమర్ రాజా బ్యాటరీస్ వంటి సంస్థ వెళ్లిపోయేలా చేశారు. కియా అనుబంధ సంస్థ వైసీపీ నాయకుల గొడవ వల్ల వెళ్లిపోయింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఉల్లంఘిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, తద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోతారని జపనీస్ రాయబారి చెప్పినా బుర్రకు ఎక్కించుకోలేదు.” అని అన్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/