వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగిన జనసేన అధినేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..మరోసారి వైస్సార్సీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం దిక్కులేకుండా పోయింది. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రకాశం జిల్లాలో గనులు తవ్వుకెళుతున్నారే తప్ప.. ప్రజలకు మంచి చేయడం లేదన్నారు. చిన్నప్పుడు ప్లోరోసిస్ కారణంగా తాము కనిగిరి నుంచి వెళ్లిపోయామని.. ఆ సమస్య ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. టీడీపీ పొత్తులో మనం ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కూడా వైసీపి విముక్త ప్రాంతంగా మారాలన్నారు. రూ.150 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్న ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో ఉన్నారని.. కానీ ప్రజలు మాత్రం పొట్ట చేత పట్టుకుని వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఉత్తరాంధ్ర నుంచి మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికు చెందిన గరికపాటి వెంకట్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.