ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని, వసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని సీఎం అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కోరారు.

అలాగే మంత్రి ఎర్రబెల్లి..ఈ ఉగాది ప్రజ‌ల జీవితాల్లో ఉష‌స్సులు నింపాలి ఆకాంక్షించారు. శుభ‌ప్రద‌మై ప్రజ‌లు సుఖ సంతోషాల‌తో ఉండాలని, ఈ ఏడాది వ‌ర్షాలు స‌మృద్ధిగా ప‌డి రాష్ట్రం పాడి పంట‌ల‌తో, ప‌సిడి కాంతుల‌తో వెలుగొందాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ స‌స్యశ్యామ‌ల‌మై సంక్షేమ‌, అభివృద్ధిలో అగ్రగామిగా కొన‌సాగాలన్నారు.

ఎమ్మెల్సీ కవిత..తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని క‌విత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.