బొగ్గు సంక్షోభం దెబ్బకు.. 42 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసిన కేంద్రం

దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కరెంట్‌ కోతలు పెరిగాయి. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగకుండా.. ఉండేందుకు ప్రయాణికుల రైళ్లను రద్ద చేస్తోంది. బొగ్గు రవాణా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా 42 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు ఇండియన్‌ రైల్వే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ కృష్ణబన్సాల్‌ తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటినితిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు.

స్థానిక ఎంపిల ఆందోళనలతో రద్దు చేసిన మూడు చత్తీస్‌గఢ్‌ రైళ్లను పునరుద్ధరించారు. మరోవైపు వచ్చే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్‌ రైళ్ల ను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు 650 పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లతో పాటు మెయిల్‌, కమ్యూటర్‌ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకతాం రావాల్సి ఉంది.

థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు కొరత కారణంగా ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ సంక్షోభం తీవ్రమవుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్తరప్రదేశ్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగమ్‌లో బొగ్గు సంక్షోభం కొనసాగుతోంది. వేసవిలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతుందని, గత వారంలో విద్యుదుత్పత్తి కర్మాగారాలకు తగినంత బగ్గు అందుబాటులో లేదని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రవాణా తదితర అంశాలకు సంబంధించిన సమస్యల వల్ల బగ్గు సరఫరాలో వేగం తగ్గడంతో కొన్ని రాష్ట్రాలు లోడ్‌ షెడ్డింగ్‌ చేస్తున్నాయి.