‘మీ ప్రభుత్వానికి శతకోటి దండాలు..మా స్కూళ్లు మార్చకండి’ – ఉదయపురం ప్రజల ఆవేదన

శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉదయపురం ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు అంత చిన్న పిల్లలు ఎలా పంపించాలి..మధ్యలో ఏమైనా జరిగితే ఎలా..ఏదైనా ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా..అంటూ ప్రశ్నింస్తున్నారు. తల్లిదండ్రులంతా ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతూ… ప్రాథమిక పాఠశాలను తీసేయవద్దంటూ వేడుకున్నారు.

‘మీ ప్రభుత్వానికి శతకోటి దండాలు. మా స్కూళ్లు మార్చకండి. మమ్మల్ని హింసపెట్టే ఈ ప్రభుత్వం మాకొద్దు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఒక గుడిలో పూజారిగా పనిచేస్తున్న ఓ తండ్రి చిన్న పిల్లల్ని చూపిస్తూ… ‘వీళ్లకు లోకజ్ఞానం ఏం తెలుస్తుంది? వీళ్లకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవర్ని అడిగి పాఠశాలల్ని విలీనం చేస్తున్నారు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటానికి ఉపాధ్యాయులు సంఘీభావం తెలపాలని కోరారు.