ఐటీ దాడులపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ లో ఐటీ దాడులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ నేతల ఇళ్లపై , ఆఫీస్ లపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టిఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు జరుపగా..ఈరోజు మంగళవారం ఉదయం నుండి మంత్రి మల్లారెడ్డి ఆఫీస్ లపై , ఇళ్లపై అలాగే ఆయన కు సంబదించిన బంధువుల ఇళ్లపై కూడా దాడులు జరిపి , పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల ఫై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

కేంద్ర సంస్థలను రాజకీయమయం చేస్తున్నారని, దర్యాప్తు సంస్థల సిబ్బందిని వారి కార్యకర్తల్లా ఉపయోగించుకుంటున్నారని బీజేపీపై ఆయన మండిపడ్డారు. దేశంలో 4 వేలమందిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగితే, వారిలో 3,900 మంది బీజేపీలో చేరారని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని భావిస్తున్నామని, కానీ తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి దాడులకు భయపడబోరని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఏ రైడ్ చేసుకుంటారో చేసుకోండి… ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి… ప్రజలు గమనిస్తున్నారు… మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో వారికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. దాడులకు భయపడి ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.

అంతకు ముందు మంత్రి తలసాని సైతం ఐటీ దాడులపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్‌ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చన్న ఆయన.. లక్ష్యం చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, దేశ చరిత్రలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదన్నారు.