నగరవాసులకు షాక్ ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే..ఈరోజు 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసింది

హైదరాబాద్ నగరంలో మెట్రో రాకముందు ఎక్కువగా నగరవాసులు ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించేవారు. రోజు లక్షల మంది తమ గమ్యస్థానాలకు , ఆఫీసులకు ఎంఎంటీఎస్‌ రైళ్లలో వెళ్లేవారు. కానీ మెట్రో వచ్చిన దగ్గరి నుండి ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఇక కరోనా తర్వాత దాదాపు 75 % ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పలు సర్వీస్ లను తగ్గిస్తూ వస్తుంది. కాగా ఈరోజు ఏకంగా 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసి షాక్ ఇచ్చింది.

రాజధానిలో నేడు టెట్‌, ఆర్‌ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేయడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నిలిపివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసుల చొప్పున ఉండగా, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక్కో సర్వీసు చొప్పున రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు. అయితే ఆర్‌ఆర్బీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఐదు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, సెలవు రోజు వస్తే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.