అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం బహిష్కరణ

ప్రాథమిక సభ్యత్వం రద్ధు చేస్తూ జనరల్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం

palaniswami-expels-paneerselvam-from-aiadmk

చెన్నై: అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశాల్లో కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంపై బహిష్కరణ వేటు వేసింది. ప్రాథమిక సభ్యత్వం రద్దుచేయడంతోపాటు సహ కోశాధికారి పదవి నుంచి తొలగించింది. అలాగే పన్నీర్ సెల్వం మద్దతుదారులైన వైతిలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకరన్ ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తం 16 తీర్మానాలు జనరల్ కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పార్టీ కార్యాలయం ముందు ఇరు వర్గాలు నిరసన చర్యలకు దిగాయి. పన్నీర్ సెల్వం మద్దతుదారులు చెప్పులతో పళనిస్వామి ఫొటోలను కొట్టడం కనిపించింది. పన్నీర్ సెల్వం దిష్టి బొమ్మలను పళనిస్వామి మద్దతు దారులు దహనం చేశారు. తాాజా పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చారు.

దీంతో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు సెక్ష్న్ 144 విధించారు. పార్టీ ట్రెజరర్ గా ఉన్న పన్నీర్ సెల్వం స్థానంలో దిండుకల్ శ్రీనివాసన్ ను పళనిస్వామి నియమించారు. సీనియర్ నేతలు పలు మార్లు అన్నన్ ఓ పన్నీర్ సెల్వంతో ఏక నాయకత్వంపై చర్చలు నిర్వహించినా.. అతడు అంగీకరించలేదని పళనిస్వామి ప్రకటించారు. పన్నీర్ సెల్వం డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. కాగా, పళనిస్వామి, మునుస్వామిలకు తనను బహిష్కరించే అధికారం లేదని పన్నీర్ సెల్వం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తానే వారిద్దరిని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. తనను అన్నాడీఎంకే కోర్డినేటర్ గా 1.5 కోట్ల మంది పార్టీ సభ్యులు నిర్ణయించినట్టు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/