ఉచిత హామీలు ప్రజాకర్షణకు తాలింపు లాంటివిః సీఈసీ రాజీవ్ కుమార్

ఎన్నికల హామీలను ఐదేళ్ల పాటు పార్టీలు గుర్తుంచుకోవట్లేదని ఆరోపణ

CEC Kumar says freebies announced by parties ahead of polls have ‘tadka of populism’

న్యూఢిల్లీః ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు కురిపించే ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు ప్రకటిస్తాయని, గెలిచాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తాయని విమర్శించారు. ఉచిత హామీలు ప్రజాకర్షణకు తాలింపు లాంటివని అన్నారు. గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా రాజకీయ పార్టీలు హామీలను ప్రకటించడం మాత్రం మానుకోలేవని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఒక హామీ, మరో రాష్ట్రంలో ఇంకో హామీ ఇస్తుంటారని ఆరోపించారు.

అధికారంలోకి రావడం కోసం అమలు చేయడం సాధ్యం కాని హామీల వరాలను కురిపిస్తాయని చెప్పారు. ఇలాంటి హామీలను నియంత్రించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీఈసీ స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగా, ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిందిగా ఒక నిర్ణీత నమూనాను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో గెలిచాక ఏంచేయబోయేది చెప్పే స్వేచ్ఛ పార్టీలకు ఉందని, అదేవిధంగా ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు.