రాహుల్‌ గాంధీపై పాక్‌ మంత్రి పొగడ్తలు

Pakistani Minister praises Rahul Gandhi

న్యూఢిలీః పాకిస్థాన్ మాజీ మంత్రి సీహెచ్ ఫవాద్ హుస్సేన్ కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై పొగడ్తలు కురిపించారు. రాహుల్ మాంచి ఫైర్ మీదున్నాడంటూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ భారత్ లో ఏం జరుగుతోందనేది ఆయన చాలా చక్కగా వివరించాడని ఫవాద్ హుస్సేన్ మెచ్చుకున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఆయన చెప్పారు.

ఇక ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా ఏంటి..? అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శించడం కనిపించింది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఉంది. కాగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నుంచి, ఎన్నికల ప్రసంగాల దాకా అన్నింట్లోనూ ముస్లింలీగ్ అవశేషాలు కనిపిస్తున్నాయంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు.

మరో నేత ఇంకో అడుగు ముందుకేసి.. ‘కాంగ్రెస్ కే హాత్, పాకిస్థాన్ కే సాథ్’ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈమేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ అభిమానిని అంటూ హఫీజ్ సయీద్ గతంలో వెల్లడించాడు, మణి అయ్యర్ పాకిస్థాన్ కు వెళ్లి మరీ మన ప్రధాని మోదీని కించపరిచారు.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ కాంగ్రెస్ లీడర్లు నినదించడం కూడా మనమంతా చూశాం.. బీకే హరిప్రసాద్ వంటి నేతలు బహిరంగంగానే పాకిస్థాన్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతారు.. సమయం, సందర్భం వస్తే పాకిస్థానీ ఉగ్రవాదులను కూడా సపోర్ట్ చేస్తారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం, ఒప్పందాల వివరాలను బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.