మోడీని ఓడించేది ఎవరైనా కానివ్వండి..వారికి శుభాకాంక్షలు: పాక్ మాజీ మంత్రి

‘Pakistan wants Narendra Modi to lose Lok Sabha elections’, says Fawad Chaudhry.

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మరోమారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అక్కసు వెళ్లగక్కారు. ఈ ఎన్నికల్లో మోడీ ఓడిపోవాలని వ్యాఖ్యానించారు. మోడీతో పాటు ఆయన భావజాలం కూడా ఓటమి పాలవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈమేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫవాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీని ఓడించేది ఎవరైనా కానివ్వండి.. అది రాహుల్ గాంధీ అయినా లేక అరవింద్ కేజ్రీవాల్ అయినా లేక మమతా బెనర్జీ అయినా.. ఎవరైనా సరే వారికి శుభాకాంక్షలు అంటూ ఫవాద్ వ్యాఖ్యానించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా ఫవాద్ చౌదరి గతంలోనూ పలుమార్లు కామెంట్స్ చేశారు. దీనిపై మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దాయాది దేశం నుంచి మన దేశంలోని రాజకీయ నేతలకు మద్దతు లభించడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మోడీ వ్యాఖ్యానించారు. అయితే, మోడీ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఫవాద్ మరోసారి రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.