టెర్రరిస్టును ప్రాణాలతో పట్టుకున్న భారత సైన్యం!

భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులు

న్యూఢిల్లీ : ఓ పాకిస్థానీ టెర్రరిస్టును భారత భద్రతాబలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. ఈ ఘటన జమ్మూకశ్మీర్ లోని యూరి సెక్టార్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, భారత్-పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద మన భూభాగంలోకి ప్రవేశించేందుకు నిన్న సాయంత్రం ఇద్దరు టెర్రరిస్టులు యత్నించారు.

వీరి కదలికలను గమనించిన భారత సైనికులు వారిపై కాల్పులు జరిపారు. తీవ్రవాదులు కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ… వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాల్పుల్లో ఒక టెర్రరిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక టెర్రరిస్టును సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఒక పాకిస్థానీ టెర్రరిస్టును ఇండియన్ ఆర్మీ ప్రాణాలతో పట్టుకోవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి.

భారత భూభాగంలోకి చొరబడేందుకు పాకిస్థాన్ టెర్రరిస్టులు అనునిత్యం యత్నిస్తూనే ఉన్నారు. పాక్ సైన్యం అండతో మన గడ్డపై అడుగుపెట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారు. గత వారం రోజుల్లో యూరి, రాంపూర్ సెక్టార్లలో టెర్రరిస్టుల మూడు చొరబాటు యత్నాలను మన సైనికులు తిప్పికొట్టారు. కొన్ని రోజుల క్రితం ముగ్గురు చొరబాటుదారులను మన జవాన్లు కాల్చి చంపారు. వారి వద్ద నుంచి ఐదు ఏకే-47 తుపాకులు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, 70 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/