ఇమ్రాన్ పై రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి

పాక్ లో పడిపోయిన గోధుమ దిగుబడి

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు ఇప్పుడు గోధుమల రూపంలో మరో కొత్త సమస్య ఎదురైంది! ఎన్నో దేశాలకు గోధుమలను ఎగుమతి చేసే పాక్ లో ఇప్పుడు గోధుమలకు కొరత ఏర్పడింది. కిలో గోధుమలు రూ. 60కి చేరుకోవడంతో, ధరల పెరుగుదలకు కారణం ప్రధాని వైఖరేనని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పాక్ లో 40 కిలోల గోధుమల బస్తా ధర రూ. 2,400కు చేరుకుంది. దేశ చరిత్రలో గోధుమలకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కాగా, డిసెంబర్ నాటికి ధర మరింతగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, వెంటనే ధరలను దింపేందుకు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి ఇమ్రాన్ ఖాన్ పై పెరుగుతోంది. గోధుమలను పండించే రైతులకు నిధులను సమకూర్చే ఆలోచనలో ఉన్నామని చెప్పడం మినహా ఇమ్రాన్ మరేమీ చేయలేదన్న విమర్శలూ వస్తున్నాయి.

ప్రస్తుతం పాక్ కు రష్యా నుంచి గోధుమలు దిగుమతి అవుతున్నాయి. గడచిన నెల రోజుల వ్యవధిలో దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నులను పాక్ దిగుమతి చేసుకుందంటే, పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో పంచదార ధర పెరుగుతూ ఉండటం, చికెన్ ధర చుక్కలను తాకుతుండటం, సమీప భవిష్యత్తులో ఇమ్రాన్ ఖాన్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విత్తన ధరలను 23 గంటల్లో నియంత్రించాలని పాక్ విత్తన సంస్థ ఖాన్ సర్కారుకు అల్టిమేటం జారీ చసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ద్రవ్యోల్బణం ఊహించని స్థాయికి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/