కోవాగ్జిన్ టీకాకు గుర్తింపు.. ఆంక్షలు ఎత్తేసిన ఆస్ట్రేలియా!

సిడ్నీ: భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన కోవాగ్జిన్ టీకా వేసుకున్న వాళ్లు త‌మ దేశానికి రావ‌చ్చు అంటూ ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కోవాగ్జిన్‌కు ఇంకా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ రాకున్నా.. వేలాది మంది ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చే విష‌యాన్ని ఆస్ట్రేలియా వెల్ల‌డించింది. దాదాపు 600 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు ఆస్ట్రేలియా ఓకే చెప్పింది. దీంతో ఇవాళ్టి నుంచి ఆ దేశంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల తాకిడి మ‌ళ్లీ మొద‌లైంది. ప్ర‌యాణికుల వ్యాక్సినేష‌న్ స్టాట‌స్ విష‌యంలో కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తున‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని ఆస్ట్రేలియా హై క‌మిషన‌ర్ బారీ ఓ ఫారెల్ ఏవో ఇవాళ తెలిపారు.

20 నెల‌ల విరామం త‌ర్వాత అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్ని తెర‌వ‌డంతో .. సిడ్నీ విమానాశ్ర‌యంలో ఇవాళ భావోద్వేగ దృశ్యాలు క‌నిపించాయి. అనేక మంది ప్ర‌యాణికులు చాలా గ్యాప్ త‌ర్వాత త‌మ ఆత్మీయుల‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంలో కొంద‌రు కంట‌నీరు పెట్టారు. కొంద‌రు ఆనందంతో గంతులేశారు. చైనాకు చెందిన సైనోఫార్మ్ టీకాను కూడా గుర్తిస్తున్న‌ట్లు ఆస్ట్రేలియా చెప్పింది. నిజానికి సైనోఫార్మ్‌, కోవాగ్జిన్ టీకాల‌కు ఇంకా డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి అనుమ‌తి రాలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/