ఆగ‌స్ట్ 15..ఢిల్లీ లక్ష్యంగా ఉగ్రదాడులకు ల‌ష్క‌ర్‌, జైషే కుట్ర‌

Pak outfits plan terror strikes on August 15, security forces

న్యూఢిల్లీ : ఆగ‌స్ట్ 15న ఢిల్లీలోని బ‌హిరంగ ప్ర‌దేశాలు, భ‌ద్ర‌తా సంస్ధ‌లే ల‌క్ష్యంగా పాకిస్తాన్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా, జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర సంస్ధ‌లు విధ్వంస‌ కుట్ర‌కు తెర‌లేపాయ‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేపాయి. దేశ రాజ‌ధాని ప్రాంతంలోని రైల్వే స్టేష‌న్లు, విదేశీ సంస్ధ‌లు స‌హా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో దాడుల‌కు ఉగ్ర సంస్ధ‌లు టార్గెట్‌గా ఎంచుకున్నాయ‌ని వార్తా క‌ధ‌నాలు వెల్ల‌డించాయి.

ప్ర‌ముఖ రోడ్లు, రైల్వే ఆస్తులు, ఢిల్లీ పోలీసుల కార్యాల‌యాలు, ఎన్ఐఏ ప్ర‌ధాన కార్యాల‌యం వంటి ల‌క్ష్యాల‌ను ల‌ష్క‌రే, జైషేలు ఉగ్ర దాడుల కోసం ఎంచుకున్నాయ‌ని తెలిసింది. ఉగ్ర సంస్ధ‌ల కుట్ర స‌మాచారం వెల్ల‌డికావ‌డంతో నిఘా సంస్ధ‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. నిఘా సంస్ధ‌ల హెచ్చ‌రిక‌ల‌తో ఢిల్లీ అంత‌టా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను క‌ట్టుదిట్టం చేయ‌డంతో న‌గ‌రవ్యాప్తంగా ఢిల్లీ పోలీసులు ముమ్మ‌రంగా పెట్రోలింగ్ చేప‌ట్టి వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. దాదాపు 10000 మంది పోలీసులు బందోబ‌స్తు విధుల్లో ఉండ‌గా, వేయి ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్ట‌మ్‌లు, ఇత‌ర నిఘా ప‌రిక‌రాల‌ను రంగంలోకి దించారు. 15న ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించే ఎర్ర‌కోట ప‌రిస‌ర ప్రాంతాల్లో బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను క‌ట్టుదిట్టం చేశారు.