టీఆర్ఎస్ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు – ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

టీఆర్ఎస్ జెండాలు మోసిన వారికే రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో సోమవారం పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో నేతలంతా జనసమీకరణలో బిజీ అయ్యారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కేసీఆర్ ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షలు ఇవ్వనున్నారని.. ఆ డబ్బు కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని జెండాలు మోసిన వారికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందుగా అందుతాయని, ఇందులో ఇతర ఆలోచన లేదని స్పష్టం చేశారు. కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.