నేటి నుండి తెలంగాణాలో వరి కొనుగోళ్లు ..చెక్ పోస్టుల వద్ద భారీ భద్రత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి పూర్తి స్థాయిలో వరి కొనుగోళ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఖమ్మం, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో గురువారమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం మంచుకొండలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. మెదక్‌ జిల్లా హవేలిఘనపూర్‌ మండలం ఔరంగాబాద్‌ తండాలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పలుచోట్ల రైతులు సంతోషం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు ధాన్యాభిషేకం చేశారు. ధాన్యం కొనుగోళ్లతో పలు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొన్నది. జూన్ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా … రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్దతు ధర రూ. 1960లో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు. ఈ సీజన్ లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మరోపక్క తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో పాటు… తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో అక్కడి ధాన్యాన్ని తెలంగాణకు తీసుకువచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ సరిహద్దుల చెక్ పోస్టుల వద్ద భద్రత చేపట్టింది. తెలంగాణతో మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, చత్తీస్ గడ్ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో అన్ని సరిహద్దుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.