వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి
హనోయిలోని 9 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

హనోయి: వియత్నాంలోని హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి చెలరేగిన మంటలు 50 మంది ప్రాణాలు బలిగొన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యలో మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, అగ్నిప్రమాదం తర్వాత ఆసుపత్రికి తరలించిన 54 మంది మరణించినట్టు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.
నైరుతి హనోయిలోని 10 అంతస్తుల భవంతిలో మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పార్కింగ్ ఫ్లోర్‌లో ముందుగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. దాదాపు 54 మంది తీవ్రంగా గాయపడ్డారని.. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 70 మందిని సురక్షితంగా రక్షించారు. ఇది చాలా తీవ్రమైన అగ్ని ప్రమాదం అని ఏజెన్సీ పేర్కొంది. కాగా, ప్రమాదం సంభవించిన భవనంలో సుమారు 45 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.