సీబీఐ దాడుల ఫై కవిత కీలక వ్యాఖ్యలు

సీబీఐ దాడులపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. దేశం గురించి ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందని, వ్యక్తులు తాము హక్కులను కోల్పోతున్నామని తెలుసుకోలేని పరిస్థితి ఉందని కవిత అన్నారు.

ముషీరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి సమావేశంలో మాట్లాడిన కవిత.. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసుకుని ముందుకెళ్తామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ… తమ సమయాన్ని వృథా చేస్తుందన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ తీసుకోను..రిలాక్స్ కూడా తీసుకునేది లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని..నిప్పులొస్తాయని అన్నారు. తెలంగాణ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై .. ఉద్యమ స్పూర్తితో దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు.

మన భాష‌, పండుగ‌ల మీద జ‌రుగుతున్న వివ‌క్ష‌ను ఉద్య‌మంలో భాగంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాం. ఆనాడు బ‌తుక‌మ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుప‌డేవారు. ఇప్పుడు బ‌తుక‌మ్మ పండుగ అంటే సంతోషంగా జ‌రుపుకుంటున్నారు. అనేక మంది యువ‌కులు, క‌ళాకారులు పాల్గొంటున్నారు. స్కూల్ పాఠ్యాంశాల్లో బ‌తుక‌మ్మ చేరింది. సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు చోటు ల‌భించింది. రాష్ట్రం సాధించిన త‌ర్వాత మ‌న ఆకాంక్ష‌లు నెర‌వేర్చుకున్నాం అని క‌విత తెలిపారు.

బీజేపీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్న వాళ్లందరినీ బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందని , దీనిపై యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. సిస్టంను మనం కాపాడితే ఆ సిస్టం మనల్ని కాపాడుతుంది. సమస్య ఉన్నప్పుడు మాట్లాడే చైతన్యం తెలంగాణలో ఇప్పటికే ఉంది. ఇదే చైతన్యం దేశంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తాం. మనం ఒక్క పిలుపు ఇస్తే.. ప్రతీ రాష్ట్రంలో మనకు ఒక శాఖ సిద్ధమవుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కవులను, కళాకారులను, రచయితలను ఏకం చేద్దాం. తెలంగాణ హక్కుల కోసం ఎలా పోరాడామే.. ఇప్పుడు దేశంలో మన హక్కుల కోసం కూడా అలాగే కొట్లాడాలి. దేశంలో మేధావి వర్గం అసంతృప్తిలో ఉంది. త్వరలోనే జాగృతి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటన చేద్దాం. జాగృతిని మరింత పటిష్టం చేసుకునేందుకు కమిటీలు వేసుకుందాం. రెస్ట్ తీసుకునేది లేదు, రిలాక్స్ అయ్యేది లేదు.. దేశమంతా తిరుగుదాం. జాగృతి సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేద్దాం.” అని కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు.