చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా

చంద్రబాబును సోమవారం వరకు సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దన్న హైకోర్టు..

ap-high-court-orders-not-to-give-chandrababu-to-cid-custody

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటషన్ పై విచారణ హైకోర్టులో ప్రారంభమయింది. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు.

చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వొద్దని కోర్టును లూథ్రా కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.