నేడు ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను మరింతగా విస్తరించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఈరోజు ఔరంగాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. ఔరంగాబాద్‌లోని ఛత్రపతి శంభాజీనగర్ జబిందా మైదానం ముస్తాబైంది. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌ అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర పరిధిలోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రెండు సార్లు బహిరంగ సభలు జరిగాయి. ఈ సభలకు భారీ స్పందన లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని , ఈరోజు మూడోసారి సభ నిర్వహించబోతున్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్థానికంగా పేరున్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటికే సీఎంను మహారాష్ట్ర నేతలు నిత్యం కలుస్తున్నారు. ఔరంగాబాద్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు ఇటీవల బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా నిర్వహిస్తున్న సభలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌కు అడుగడుగునా స్వాగతం పలుకుతూ… భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లతో శంభాజీనగర్ కొత్తదనాన్ని సంతరించుకుంది.