విరిగిపడిన కొండచరియాలు..100 మందికి పైగా మృతి

more-than-100-dead-in-papua-new-guinea-landslide

మెల్‌బోర్న్‌: పాపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి చెందారు. ఓ గ్రామంపై విరుచుకుపడిన కొండచరియలు ఇళ్లను సమూలంగా నేలమట్టం చేశాయి. రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని కావోకలం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

గ్రామస్థులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగి పడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఇప్పటి వరకు మృతుల సంఖ్యపై ప్రకటన చేయలేదు. అలాగే, సహాయక కార్యక్రమాలపైనా స్పష్టత లేదు. ప్రధాని జేమ్స్ మార్పే బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక కొండచరియలు విరిగిపడ్డ సంఘటనలో తన కుటుంబంలో నలుగురు మృతిచెందారని ఓ విద్యార్థి వాపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో అందరూ నిద్రలో ఉన్నారు. దాంతో.. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మరోవైపు కౌకలం గ్రామం మొత్తం ధ్వంసం అయ్యింది. గ్రామం సమీపంలోనే పర్వతం ఉంది. ఈ పర్వతం పైనుంచే కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద ఉన్నవారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.