లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అమిత్‌ షా వివరణ ఇవ్వాలి : విపక్షాల డిమాండ్‌

opposition-leaders-slam-bjp-demands-amit-shah’s-reply-on-parliament-security-breach

న్యూఢిల్లీః భారత పార్లమెంట్‌లో భారీ భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించి కలర్‌ స్మోక్‌ వదలడం తీవ్ర కలకలం రేపింది. పార్లమెంట్‌ భవనంపై దాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైన రోజే.. లోక్‌సభలో భద్రతా వైఫల్యం బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భద్రతా ఉల్లంఘన అంశంపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. నేడు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షాలు సమావేశమై.. పార్లమెంట్‌ ఉభయ సభల్లో భద్రతా ఉల్లంఘన అంశాన్ని గట్టిగా లేవనెత్తాలని నిర్ణయించారు. మరోవైపు పార్లమెంట్‌లో భారీ భద్రతా లోపంపై లోక్‌సభ సెక్రటేరియట్‌ గురువారం ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్‌ చేసింది.